అక్టోబర్ 3న నిజామాబాద్​కు ప్రధాని : ఎంపీ అర్వింద్

అక్టోబర్ 3న నిజామాబాద్​కు ప్రధాని : ఎంపీ అర్వింద్

ఇందూరు ధన్యవాద్​ సభకు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్​,  వెలుగు:  నిజామాబాద్​ కు మంగళవారం ప్రధాని మోదీ రానుండగా..  బీజేపీ లీడర్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్​ వేదికగా మోదీ జాతికి అంకితం చేస్తారు. అనంతరం గవర్నమెంటు ప్రభుత్వ గిరిరాజ్​ కాలేజీ మైదానంలో భారీ సభ లో ప్రసంగిస్తారు.  వర్షం కురిసినా ఇబ్బందిలేకుండా  రెండు లక్షల మంది కూర్చునేలా టెంట్లు వేస్తున్నారు.

నాలుగు భారీ టెంట్లు వేసే పనిలో నిపుణులైన గుజరాజ్​, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది లేబర్లు పనిచేస్తున్నారు. మైదానం మొత్తాన్ని మొరం మట్టితో చదును చేసి కంకర మిక్స్​తో తాత్కాలిక రోడ్లు వేస్తున్నారు. భారీ లైట్లు, ఆధునీక సౌండ్​ సిస్టం అమర్చుతున్నారు. కరెంటు సమస్య లేకుండా ముందు జాగ్రత్తగా జనరేటర్లు అందుబాటులో పెట్టారు. 

అంతా ఎస్పీజీ కనుసన్నల్లో 

ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ పోలీసుల కనుసన్నల్లో మొత్తం ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేయిస్తోంది. ​దిల్లీ నుంచి వచ్చిన ఐజీ స్థాయి ఐపీఎస్​ అధికారి ఇక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభా మైదానం మొత్తాన్ని ఇంచించు మెటల్​ డిటెక్టర్లతో  తనిఖీ చేయిస్తున్నారు. సోమవారం రాత్రికి పనులన్నీ ముగించేలా ప్లాన్​ వేసి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.  ఎస్పీజీకి సహకారం అందించడానికి జిల్లా పోలీసులు గ్రౌండ్​లో మరో టెంటు వేసుకొని అందుబాటులో ఉన్నారు. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్​ యాదవ్​ ఇక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పడు తెలుసుకుంటూ మార్గనిర్దేశం చేస్తున్నారు. ఐజీ చంద్రశేఖర్​రెడ్డి ఇక్కడే ఉండి పనులు చూస్తున్నారు. 

ధన్యవాద్​ సభ

సభకు మొదట ఇందూరు జనగర్జన పేరు పెట్టారు. పాలమూరు​ వేదికగా రాష్ట్రానికి ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో  సభను ధన్యవాద్​ సభగా మార్చారు. రైతులు అధిక సంఖ్యలో వచ్చి బోర్డు ఇస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలుపాలని ఎంపీ అర్వింద్​ పిలుపునిచ్చారు. 

నిఘా నీడలో గ్రౌండ్​

సోమవారం గ్రౌండ్​ మొత్తం ఎస్పీజీ కంట్రోల్​లోకి వెళ్లనుంది. వారి ఆధీనంలోకి వెళ్లాక వ్యక్తుల రాకపోకలపై నిఘా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త కలెక్టరేట్​లోని హెలిపాడ్​లో హెలికాఫ్టర్​ ల్యాండ్​ అయ్యాక ప్రత్యేక మార్గంలో ప్రధాని మోదీ సభా ప్రాంగణానికి ఐదు నిమిషాల్లో చేరుకుంటారు. మొత్తం 8 వేల మంది పోలీసులను ఆయన బందోబస్తు కోసం నియమించనున్నారు.

ప్రధానికి చేరువలో ఉండే వ్యక్తులకు ప్రత్యేక పాస్​లు ఎస్పీజీ సిఫారసు మేరకు జిల్లా పోలీసులు జారీ చేయనున్నారు. సభా వేదిక దగ్గర్లో దూరదర్శన్​ మినహా ఇతర మీడియా ఛానళ్లు వీడియోలు తీయొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్​ వచ్చాక ప్రధాని మోదీ 2 గంటలు ఉండనున్నారు. ఎంపీ అర్వింద్​ ఆధ్వర్యంలో బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్​ జి.కిషన్​రెడ్డి, ఈటల రాజేందర్​ ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించి వెళ్లారు.